భాద్రపద మాసం · తెలుగు ఇంటి వేడుక
వినాయక చవితి
శ్రీ వరసిద్ధి వినాయకుడు · దాదాపు 60 నిమిషాలు · 17 దశలు
ఎప్పుడు?
- మన యాప్ తేదీ
- టీటీడీ పంచాంగం
విధానం — ఒక చూపులో
తేదీలు మన సొంత పంచాంగ ఇంజిన్ లెక్క — టీటీడీ శ్రీవారి క్యాలెండర్‌తో నిమిషం తేడా లేకుండా సరిపోతుంది. ఈ విధానాన్ని మా గురువుగారు పరిశీలించారు.
ఇంట్లో అందరూ కలిసి చేసుకునే పండుగ పూజ ఇది. పురోహితుడు లేకపోయినా బెంగ అక్కర్లేదు — ఒక్కో మెట్టూ మీ పక్కనే ఉండి ఈ విధానం నడిపిస్తుంది. ఏమి చేయాలో తెలుగులోనే చెబుతుంది, మంత్రాలు మీ లిపిలోనే కనబడతాయి. అన్నీ సమకూరాలని లేదు — ఉన్నంతలో, భక్తితో చేస్తే అదే స్వామికి పండుగ.
పూజకు మంచి సమయం ఉదయం స్నానం అయ్యాక, మధ్యాహ్నంలోగా. మొత్తం పూజకు సుమారు గంట; వ్రత కథతో కలిపి గంటన్నర అనుకోండి. ఉద్వాసనం మాత్రం నిమజ్జనం చేసే రోజు.
పూర్తి విధానం
పూజకు సిద్ధం
- పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి, పీటపై శుభ్రమైన వస్త్రం పరచండి.
- సహజ మట్టితో చేసిన వినాయకుడిని పీటపై ఉంచి, పూలు, ఆకులు లేదా మళ్లీ ఉపయోగించగల అలంకరణలతో అలంకరించండి.
- పూజకు కావాల్సిన సామగ్రి, పూలు, గరిక, పత్రి, పండ్లు, నైవేద్యం అన్నీ దగ్గరగా సిద్ధం చేసుకోండి.
- 🌿 ప్రకృతి సూచన: ప్లాస్టిక్ పూలు, థర్మాకోల్, మెరుపు అలంకరణల బదులుగా సహజమైన లేదా మళ్లీ ఉపయోగించగల అలంకరణలను ఎంచుకోండి.
సామాన్లు ఒకసారి చూసుకోండి
- పూజలోకి వెళ్ళే ముందు నిత్య పూజ సామాన్లు మరియు చెక్‌లిస్ట్‌లో ఇచ్చినవి అన్నీ లేదా వీలైనవి ఉన్నాయా ఒకసారి చూసుకోండి.
- మీరు ఒకసారి చూసుకుంటాను అంటే కింద ఉన్న చెక్‌లిస్ట్ బటన్ నొక్కండి; అవసరం లేదు అనుకుంటే ముందుకి వెళ్దాం.
దీపం వెలిగించండి
- పూజా స్థలంలో దీపం వెలిగించండి.
శ్లోకంశుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః । శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే ॥
ఆచమనం
- కుడిచేతిలో కొద్దిగా నీరు తీసుకుని, ప్రతి మంత్రం తర్వాత కొద్దిగా నీటిని స్వీకరించండి.
శ్లోకంఓం కేశవాయ స్వాహా । ఓం నారాయణాయ స్వాహా । ఓం మాధవాయ స్వాహా ।
సంకల్పం
- చేతిలో కొద్దిగా అక్షతలు, నీరు తీసుకుని భక్తిగా సంకల్పించండి:
- “ఈ రోజు శ్రీ వినాయక చవితి సందర్భంగా, మా కుటుంబ క్షేమం, ఆరోగ్యం, శాంతి, శుభం కోసం శ్రీ వినాయక స్వామిని భక్తితో పూజిస్తున్నాను.”
- తర్వాత అక్షతలను పూజా పళ్లెంలో వదలండి.
ఆవాహనం
- వినాయకుడిని భక్తితో ఆహ్వానిస్తూ పువ్వు లేదా అక్షతలు సమర్పించండి.
శ్లోకంఓం గం గణపతయే నమః । ఆవాహయామి ॥
వస్త్రం
- వినాయకుడికి చిన్న వస్త్రం ఉంటే ధరింపజేయండి.
- లేకపోతే శుభ్రమైన కొత్త వస్త్రాన్ని స్వామివారి ముందు సమర్పించండి.
శ్లోకంఓం శ్రీ గణేశాయ నమః । వస్త్రం సమర్పయామి ॥
గంధం • పసుపు • కుంకుమ
- వినాయకుడికి గంధం సమర్పించండి.
- తర్వాత పసుపు, కుంకుమ సమర్పించండి.
శ్లోకంఓం శ్రీ గణేశాయ నమః । గంధం సమర్పయామి ॥
యజ్ఞోపవీతం
- వినాయకుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. వినాయకుడి ఎడమ భుజం మీద నుంచి కుడి వైపు దిగేలా ధరింపజేయండి.
- విగ్రహానికి ధరింపజేయగలిగితే ధరింపజేయండి. లేకపోతే స్వామివారి ముందు సమర్పించండి.
శ్లోకంఓం శ్రీ గణేశాయ నమః । యజ్ఞోపవీతం సమర్పయామి ॥
దూర్వ లేదా గరిక
- శుభ్రమైన గరికను వినాయకుడికి భక్తిగా సమర్పించండి.
శ్లోకంఓం గం గణపతయే నమః । దూర్వాంకురాన్ సమర్పయామి ॥
21 పత్రి పూజ
- వినాయక చవితిలో 21 రకాల పత్రులతో పూజ చేయడం సంప్రదాయం.
- అన్ని 21 రకాల పత్రులు దొరకకపోయినా, 21 దూర్వ / గరికతో భక్తిగా పూజ కొనసాగించవచ్చు.
శ్లోకంఓం సుముఖాయ నమః । మాచీపత్రం పూజయామి ॥ ఓం గణాధిపాయ నమః । బృహతీపత్రం పూజయామి ॥ ఓం ఉమాపుత్రాయ నమః । బిల్వపత్రం పూజయామి ॥ ఓం గజాననాయ నమః । దూర్వాయుగ్మం పూజయామి ॥ ఓం హరసూనవే నమః । దత్తూరపత్రం పూజయామి ॥ ఓం లంబోదరాయ నమః । బదరీపత్రం పూజయామి ॥ ఓం గుహాగ్రజాయ నమః । అపామార్గపత్రం పూజయామి ॥ ఓం గజకర్ణాయ నమః । తులసీపత్రం పూజయామి ॥ ఓం ఏకదంతాయ నమః । చూతపత్రం పూజయామి ॥ ఓం వికటాయ నమః । కరవీరపత్రం పూజయామి ॥ ఓం భిన్నదంతాయ నమః । విష్ణుక్రాంతపత్రం పూజయామి ॥ ఓం వటవే నమః । దాడిమీపత్రం పూజయామి ॥ ఓం సర్వేశ్వరాయ నమః । దేవదారుపత్రం పూజయామి ॥ ఓం ఫాలచంద్రాయ నమః । మరువకపత్రం పూజయామి ॥ ఓం హేరంబాయ నమః । సింధువారపత్రం పూజయామి ॥ ఓం శూర్పకర్ణాయ నమః । జాతీపత్రం పూజయామి ॥ ఓం సురాగ్రజాయ నమః । గండకీపత్రం పూజయామి ॥ ఓం ఇభవక్త్రాయ నమః । శమీపత్రం పూజయామి ॥ ఓం వినాయకాయ నమః । అశ్వత్థపత్రం పూజయామి ॥ ఓం సురసేవితాయ నమః । అర్జునపత్రం పూజయామి ॥ ఓం కపిలాయ నమః । అర్కపత్రం పూజయామి ॥ ఓం శ్రీ గణేశ్వరాయ నమః । ఏకవింశతి పత్రాణి పూజయామి ॥
శ్రీ వినాయక అష్టోత్తరం
- శ్రీ వినాయకుడి 108 నామాలను చదువుతూ ప్రతి నామానికి పువ్వు లేదా అక్షతలు సమర్పించండి.
నైవేద్యం
- మీకు వీలైన నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించండి.
- తర్వాత కొద్దిగా నీరు సమర్పించండి.
శ్లోకంఓం గం గణపతయే నమః । నైవేద్యం సమర్పయామి ॥
వినాయక చవితి వ్రత కథ (వినాయకుడి జననం)
- వ్రతకథ వినే ముందు చేతిలో కొద్దిగా అక్షతలు ఉంచుకోండి. కథ పూర్తయ్యాక వాటిని శిరస్సుపై వేసుకోండి.
- ⏩ కథ కొంచెం నెమ్మదిగా అనిపిస్తే, కింద ఉన్న ×1 బటన్‌తో వేగం పెంచుకోవచ్చు.
- వ్రతానికి శమంతకోపాఖ్యానం విన్నా చాలు — ఈ జనన కథ వినాయకుడి గొప్పతనం కోసం. సమయం తక్కువైతే ఈ భాగం దాటవేయవచ్చు.
వినాయక చవితి వ్రత కథ (శమంతకోపాఖ్యానం)
- వ్రతకథ వినే ముందు చేతిలో కొద్దిగా అక్షతలు ఉంచుకోండి. కథ పూర్తయ్యాక వాటిని శిరస్సుపై వేసుకోండి.
- ⏩ కథ కొంచెం నెమ్మదిగా అనిపిస్తే, కింద ఉన్న ×1 బటన్‌తో వేగం పెంచుకోవచ్చు.
- 📖 శ్యమంతక మణి కథ
- ఇదే వ్రతానికి ప్రధాన కథ — దీన్ని వినడం/చదవడం తప్పనిసరి. చేతిలో అక్షతలు పట్టుకుని వినండి; కథ అయ్యాక శిరస్సుపై వేసుకోండి.
ప్రార్థన
- చేతులు జోడించి వినాయకుడిని ప్రార్థించండి.
- తర్వాత మీ కుటుంబం, ఆరోగ్యం, చదువు, పని లేదా మీ కోరికలను మీ మాటల్లోనే వినాయకుడితో చెప్పుకోండి. ❤️
- ఆ తర్వాత మీ కోసం మాత్రమే కాదు, లోకక్షేమం కోసం కూడా నిస్వార్థంగా ప్రార్థించండి.
శ్లోకంతత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥
హారతి
- దీపం లేదా కర్పూరంతో వినాయకుడికి హారతి ఇవ్వండి.
- హారతి తీసుకుని నమస్కరించండి.
శ్లోకంఓం గం గణపతయే నమః । నీరాజనం సమర్పయామి ॥
ఉద్వాసన & నిమజ్జన విధానం
ఉద్వాసనం
- నిమజ్జనం చేసే రోజు వినాయకుడికి దీపం, ధూపం, పూలు, నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి.
- తర్వాత చేతులు జోడించి ప్రేమగా ఇలా ప్రార్థించండి:
- “వినాయకా… మా పూజను స్వీకరించి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇప్పుడు మీ స్వస్థానానికి తిరిగి వెళ్లి, మళ్లీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రావాలి.” ❤️
- అక్షతలు లేదా పువ్వు సమర్పిస్తూ ఈ మంత్రం చెప్పండి.
- తర్వాత నమస్కరించి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లండి.
పూజా సామగ్రి — తర్వాత ఏం చేయాలి
- 🌺 మీ ఇంటి సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఉంచే రోజుల వరకు ప్రతిరోజూ దీపం, ధూపం, పూలు, నైవేద్యం, హారతి — సులభంగా చేయవచ్చు.
- ♻️ పూలు, పత్రి, గరిక — compost చేయగలిగితే compost చేయండి, లేదా biodegradable wet wasteగా వేయండి.
- 🌊 “Natural కదా” అని చెరువులు, కాలువలు, నదుల్లో వేయకండి. పూలు, పత్రి సహజమైనవే అయినా, పెద్ద మొత్తంలో నీటిలో పడితే అవి కుళ్లే సమయంలో నీటిలోని oxygen తగ్గుతుంది. దాంతో చేపలకు, జలచరాలకు శ్వాస కష్టమవుతుంది; నీటి నాణ్యత తగ్గుతుంది; పూలతో పాటు ఉన్న నూనె, కుంకుమ, రంగులు, దారం వంటివి వాటికి మరింత హాని చేస్తాయి.
- Eco-friendly అంటే “natural materialని నీటిలో వేయడం” కాదు — ప్రకృతికి హాని కలగకుండా దాన్ని తిరిగి మట్టిలో కలపడం. 🌿
- 🍎 పండ్లు, కొబ్బరికాయ, నైవేద్యం — ప్రసాదంగా తీసుకోండి, పంచుకోండి.
- ✨ Decorations — తర్వాతి పూజలకు మళ్ళీ ఉపయోగించండి.
నిమజ్జనం — Eco-friendly
- 🌿 సహజ మట్టి వినాయకుడైతే, వీలైతే ఇంట్లోనే పెద్ద పాత్రలో నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం తర్వాత ఆ నీటిని మొక్కలకు పోయవచ్చు.
- 🌊 బయట నిమజ్జనం చేస్తే, designated eco-friendly immersion ponds ఉపయోగించండి.
- 🚫 పూలు, plastic covers, thermocol, cloth decorations — నీటిలో వేయకండి.
- ❤️ వినాయకుడిని ప్రేమగా ఇంటికి ఆహ్వానించాం. పూలతో పూజించాం. నైవేద్యం పెట్టాం. హారతి ఇచ్చాం.
- ఆయనకు వీడ్కోలు చెప్పేటప్పుడు కూడా… ఆయన సృష్టికి హాని కలగకుండా చూసుకుంటే, అది మన పూజకు మరింత అందమైన ముగింపు. 🌿❤️
- వినాయకుడిని పూజిద్దాం. వినాయకుడి సృష్టినీ గౌరవిద్దాం.
- 🙏 గణపతి బప్పా మోరియా!
సామగ్రి లిస్ట్
🪔 నిత్య పూజా సామగ్రి
- పసుపు
- కుంకుమ
- గంధం
- అక్షతలు
- దీపం కింద పెట్టడానికి ప్లేట్లు
- పత్తి వత్తులు
- నూనె / నెయ్యి
- కర్పూరం
- అగరబత్తి / ధూపం
- అగ్గిపెట్టె
- గంట
- హారతి పళ్లెం
- పూజా నీటి పాత్ర
- చిన్న గిన్నెలు
- చెంచా
- ధారం
- ఉద్ధరిణి
🪷 వినాయకుడు & పూజా పీట
- సహజ మట్టి వినాయకుడు
- పూజా పీట
- పీటపై పరచడానికి శుభ్రమైన వస్త్రం
- వినాయకుడికి చిన్న వస్త్రం
- యజ్ఞోపవీతం
- పాలవెల్లిఐచ్ఛికం
🌺 పూలు • పత్రి • పండ్లు & తాంబూలం
- పూలు
- పూలమాలఐచ్ఛికం
- గరిక / దూర్వలు
- 21 రకాల పత్రిఐచ్ఛికం
- మామిడి ఆకులు / తోరణంఐచ్ఛికం
- అరటిపండ్లు
- మీకు అందుబాటులో ఉన్న ఇతర పండ్లుఐచ్ఛికం
- కొబ్బరికాయ
- తమలపాకులు
- వక్కలు
🍚 నైవేద్యానికి
- ఉండ్రాళ్లుఐచ్ఛికం
- కుడుములు / మోదకాలుఐచ్ఛికం
- బెల్లంఐచ్ఛికం
- పాయసంఐచ్ఛికం
- పానకంఐచ్ఛికం
- చలిమిడి, వడపప్పుఐచ్ఛికం
- ఇతర ఇంట్లో చేసిన ప్రసాదంఐచ్ఛికం
🌿 ఏకవింశతి పత్రి
- మాచిపత్రిఐచ్ఛికం
- వాకుడు ఆకుఐచ్ఛికం
- మారేడుఐచ్ఛికం
- గరికఐచ్ఛికం
- ఉమ్మెత్తఐచ్ఛికం
- రేగుఐచ్ఛికం
- ఉత్తరేణిఐచ్ఛికం
- తులసిఐచ్ఛికం
- మామిడిఐచ్ఛికం
- గన్నేరుఐచ్ఛికం
- విష్ణుక్రాంతఐచ్ఛికం
- దానిమ్మఐచ్ఛికం
- దేవదారుఐచ్ఛికం
- మరువంఐచ్ఛికం
- వావిలిఐచ్ఛికం
- జాజిఐచ్ఛికం
- దేవకాంచనం / గండకీఐచ్ఛికం
- జమ్మిఐచ్ఛికం
- రావిఐచ్ఛికం
- మద్ది / తెల్ల మద్దిఐచ్ఛికం
- జిల్లేడు / తెల్ల జిల్లేడుఐచ్ఛికం
ప్రసాదం
ఉండ్రాళ్లు, కుడుములు / మోదకాలు
వినాయక చవితి నైవేద్యంలో మొదట గుర్తొచ్చేవి ఇవే.
పాయసం, పానకం, చలిమిడి, వడపప్పు
వీటిలో మీకు వీలైనవి మాత్రమే సిద్ధం చేసుకుంటే చాలు.
బెల్లం, ఇతర ఇంట్లో చేసిన ప్రసాదం
మీకు వీలైన నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించండి.
📖 వ్రత కథ — వినాయకుడి జననం
🌿 సూత మహర్షి చెప్పిన వినాయక వ్రత మహిమ
పూర్వం ధర్మరాజు తన రాజ్యాన్ని, సిరిసంపదలను కోల్పోయి, ద్రౌపది మరియు తన తమ్ములతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.
అక్కడ శౌనకాది మహర్షులకు ఎన్నో పురాణ రహస్యాలను వివరిస్తున్న సూత మహర్షిని దర్శించి నమస్కరించాడు.
“మహర్షీ… మేము రాజ్యాన్ని, సంపదలను అన్నింటినీ కోల్పోయాం. ఈ కష్టాలు తొలగి, మళ్లీ పూర్వ వైభవం పొందడానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి” అని ప్రార్థించాడు.
అప్పుడు సూత మహర్షి ధర్మరాజుకు శ్రీ వినాయక వ్రత మహిమను వివరించడం ప్రారంభించాడు.
🐘 గజాసురుడి తపస్సు — శివయ్య ఇచ్చిన వరం
పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమశివుడిని గురించి ఎంతో ఘోరమైన తపస్సు చేశాడు.
అతని తపస్సుకు మెచ్చిన శివయ్య ప్రత్యక్షమై, “గజాసురా… నీకు ఏ వరం కావాలో కోరుకో” అన్నారు.
గజాసురుడు శివయ్యను నమస్కరించి, “స్వామీ… మీరు ఎప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి” అని కోరుకున్నాడు.
భక్తుడి కోరికను కాదనలేక శివయ్య గజాసురుడి ఉదరంలోకి ప్రవేశించారు.
❤️ శివయ్యను తిరిగి తీసుకురావడానికి శ్రీహరి చేసిన ఉపాయం
కైలాసంలో పార్వతీదేవికి శివయ్య ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఎంత వెతికినా కనిపించలేదు.
చివరకు శివయ్య గజాసురుడి ఉదరంలో ఉన్నారని తెలుసుకుంది. ఆయనను ఎలా బయటకు తీసుకురావాలో తెలియక శ్రీమహావిష్ణువును ప్రార్థించింది.
విష్ణుమూర్తి పార్వతీదేవికి అభయం ఇచ్చి, బ్రహ్మాది దేవతలను పిలిచారు. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించారు.
శివయ్య వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలు వాయిద్యాలు తీసుకున్నారు.
శ్రీమహావిష్ణువు గంగిరెద్దుల మేళాన్ని నడిపించే వాడిగా మారి, అందరూ కలిసి గజాసురుడి రాజ్యానికి వెళ్లారు.
గజాసురుడి ముందు నందిని ఎంతో అద్భుతంగా ఆడించారు. ఆ ప్రదర్శన చూసి గజాసురుడు ఎంతో ఆనందపడి, “మీకు ఏం కావాలో కోరుకోండి. ఇస్తాను” అన్నాడు.
అప్పుడు శ్రీహరి, “ఈ గంగిరెద్దు సాధారణమైనది కాదు. ఇది శివయ్య వాహనం నంది. తన స్వామిని వెతుక్కుంటూ వచ్చింది. శివయ్యను తిరిగి ఇవ్వు” అన్నారు.
ఆ మాటతో గజాసురుడికి తన ముందున్నది శ్రీమహావిష్ణువని అర్థమైంది. తనకు మరణం తప్పదని గ్రహించాడు.
అప్పుడు తన ఉదరంలో ఉన్న శివయ్యను ప్రార్థిస్తూ, “స్వామీ… నా శిరస్సు త్రిలోకాలలో పూజింపబడాలి. నా చర్మాన్ని మీరు ధరించాలి” అని కోరుకున్నాడు.
శివయ్య ఆ వరాన్ని అనుగ్రహించారు. నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చగా, శివయ్య బయటకు వచ్చారు. తర్వాత శివయ్య కైలాసానికి బయలుదేరారు.
🌺 పార్వతీదేవి సృష్టించిన బాలుడు గజాననుడిగా మారిన విధం
శివయ్య తిరిగి వస్తున్నారని తెలిసి పార్వతీదేవి ఎంతో సంతోషించింది.
స్నానానికి సిద్ధమవుతూ, తన శరీరానికి రాసుకున్న నలుగు పిండితో ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారు చేసి, తన శక్తితో ప్రాణం పోసింది.
ఆ బాలుడిని ద్వారం దగ్గర నిలబెట్టి, “నేను చెప్పే వరకు ఎవరినీ లోపలికి పంపకు” అని చెప్పింది.
తల్లి మాట ప్రకారం బాలుడు అక్కడే కాపలా నిలబడ్డాడు.
అంతలో శివయ్య కైలాసానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లబోతుండగా ఆ బాలుడు అడ్డుకున్నాడు.
తన ఎదుట ఉన్నది ఎవరో బాలుడికి తెలియదు. అతనికి తెలిసింది ఒక్కటే — తల్లి చెప్పిన మాటను పాటించాలి.
శివయ్య ఎంత చెప్పినా అతను దారి ఇవ్వలేదు. కోపావేశంలో శివయ్య తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించి లోపలికి వెళ్లారు.
కొద్దిసేపటి తర్వాత పార్వతీదేవితో మాట్లాడుతుండగా బాలుడి విషయం వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించింది.
శివయ్యకు తాను గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. గజాసురుడి శిరస్సును తీసుకొచ్చి ఆ బాలుడి శరీరానికి అమర్చి, తిరిగి ప్రాణం పోశారు.
అలా ఆ బాలుడు గజాననుడు అయ్యాడు. ❤️
పార్వతీ పరమేశ్వరులు అతన్ని తమ కుమారుడిగా ఎంతో ప్రేమగా పెంచారు. గజాననుడు అనింద్యుడు అనే మూషికాన్ని తన వాహనంగా చేసుకున్నాడు.
తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు.
👑 గజాననుడు విఘ్నాధిపతిగా ఎలా అయ్యాడు?
ఒకరోజు దేవతలు, మునులు శివయ్య దగ్గరకు వచ్చి, “విఘ్నాలకు ఒక అధిపతిని నియమించండి” అని కోరారు.
ఆ స్థానాన్ని గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ కోరుకున్నారు.
అప్పుడు శివయ్య ఒక పరీక్ష పెట్టారు. “మీలో ఎవరు ముల్లోకాలలోని పుణ్యనదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారే విఘ్నాలకు అధిపతి” అన్నారు.
కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై బయలుదేరిపోయాడు.
గజాననుడు మాత్రం తండ్రికి నమస్కరించి, “తండ్రీ… నేను ఇలా వేగంగా అన్ని నదులకూ ఎలా వెళ్లగలను? నాకు ఒక మార్గం చెప్పండి” అని అడిగాడు.
అప్పుడు శివయ్య అతనికి నారాయణ మంత్ర మహిమను వివరించి మంత్రోపదేశం చేశారు. గజాననుడు భక్తితో ఆ మంత్రాన్ని జపించాడు.
అద్భుతం జరిగింది. కుమారస్వామి ఏ పుణ్యనదికి వెళ్లినా… తనకంటే ముందే అక్కడ గజాననుడు దర్శనమిచ్చాడు.
చివరకు కుమారస్వామి కైలాసానికి తిరిగి వచ్చేసరికి గజాననుడు అప్పటికే శివయ్య దగ్గర ఉన్నాడు.
తన అన్నయ్య మహిమను గ్రహించిన కుమారస్వామి, “ఈ ఆధిపత్యానికి అన్నయ్యే అర్హుడు” అని నమస్కరించాడు.
అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నాధిపతి అయ్యాడు. అప్పటి నుంచి ఆయన విఘ్నేశ్వరుడు అయ్యాడు. ❤️
🌙 చంద్రుడి నవ్వు — పార్వతీదేవి శాపం
విఘ్నాధిపత్యం పొందిన ఆనందంలో దేవతలు, భక్తులు వినాయకుడికి ఎన్నో కుడుములు, ఉండ్రాళ్లు, పండ్లు, పానకం, వడపప్పు వంటి నైవేద్యాలను సమర్పించారు.
వినాయకుడు ఆనందంగా వాటిని స్వీకరించాడు. కొన్ని తిన్నాడు… కొన్ని తన మూషిక వాహనానికి ఇచ్చాడు… మరికొన్ని చేతిలో పట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు.
తల్లిదండ్రులకు నమస్కారం చేయడానికి వంగబోయాడు. కానీ నిండుగా ఉన్న తన బొజ్జతో వంగడం కష్టమైంది.
ఆ దృశ్యాన్ని శివయ్య శిరస్సుపై ఉన్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు.
చంద్రుడి చూపు తగిలిన వెంటనే వినాయకుడి ఉదరం పగిలి, తిన్న కుడుములన్నీ బయటకు వచ్చి… వినాయకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తన కుమారుడిని చూసిన పార్వతీదేవి దుఃఖంతో చంద్రుడిని శపించింది. “నీ చూపు వల్ల నా కుమారుడికి ఈ స్థితి వచ్చింది. ఇకపై నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయి” అంది.
తర్వాత బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి కైలాసానికి వచ్చి, వినాయకుడికి తిరిగి ప్రాణం పోసి, పార్వతీదేవిని చంద్రుడిపై ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రార్థించారు.
తన కుమారుడు తిరిగి బ్రతికినందుకు పార్వతీదేవి ఆనందించింది. అందువల్ల చంద్రుడిపై ఇచ్చిన శాపం తీవ్రతను తగ్గించింది.
“నా కుమారుడు చంద్రుడి దృష్టి వల్ల మరణించిన ఈ ఒక్క రోజున మాత్రమే — భాద్రపద మాస శుక్ల చవితి రోజున — చంద్రుడిని చూసిన వారికి ఈ శాపం వర్తిస్తుంది” అని చెప్పింది.
అప్పటి నుంచి ప్రజలు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకుండా ఉండే ఆచారాన్ని పాటించడం ప్రారంభించారు. కొంతకాలం ఇలా గడిచింది.
💎 శమంతకోపాఖ్యానం (ప్రధాన కథ)
చదవండి (53)
📖 శ్యమంతక మణి కథ
యాదవ వంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు.
సత్రాజిత్తు సూర్యభగవానుడిని ఎంతో భక్తితో ఆరాధించేవాడు. అతని భక్తికి మెచ్చిన సూర్యుడు, ఒక రోజు అతనికి శ్యమంతక మణి అనే దివ్యమైన రత్నాన్ని ఇచ్చాడు.
ఆ మణికి ఎంతో శక్తి ఉందని చెబుతారు. అది ఉన్న చోట సంపద, శుభం కలుగుతాయి. ప్రతిరోజూ ఎంతో బంగారం కూడా ఇచ్చేది. అయితే ఆ మణిని ధరించే వ్యక్తి శుచిగా, నియమంగా ఉండాలని ఒక నియమం ఉండేది.
ఒక రోజు సత్రాజిత్తు ఆ మణిని మెడలో వేసుకుని ద్వారక వీధుల్లో వస్తుండగా, దాని వెలుగు చూసిన ప్రజలు సూర్యభగవానుడే వస్తున్నాడని అనుకున్నారు.
శ్రీకృష్ణుడు ఆ మణి గురించి తెలుసుకుని, “ఇంత శక్తివంతమైన మణి రాజైన ఉగ్రసేనుడి దగ్గర ఉంటే ప్రజలకు, రాజ్యానికి ఉపయోగపడుతుంది” అని భావించాడు.
ఇది తెలిసిన సత్రాజిత్తు మాత్రం మణిని తన తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు.
ఒక రోజు ప్రసేనుడు శ్యమంతక మణిని మెడలో వేసుకుని వేటకు అడవికి వెళ్లాడు.
అక్కడ ఒక సింహం అతనిపై దాడి చేసి చంపేసింది. తర్వాత ఆ సింహాన్ని జాంబవంతుడు వధించాడు. సింహం దగ్గర ఉన్న శ్యమంతక మణిని చూసి, దాన్ని తన గుహకు తీసుకెళ్లి తన చిన్న కుమారుడికి ఆటవస్తువుగా ఇచ్చాడు.
ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఆందోళన చెందాడు. అతని దగ్గర ఉన్న శ్యమంతక మణి కూడా కనిపించకపోవడంతో, “మణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపి ఉంటాడు” అని అనుమానించాడు.
ఆ మాట ద్వారక అంతటా వ్యాపించింది.
తాను చేయని తప్పుకు తనపై నింద రావడంతో శ్రీకృష్ణుడు నిజం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కొంతమందిని వెంట తీసుకుని అడవికి వెళ్లి ప్రసేనుడి జాడను వెతికాడు. అక్కడ ప్రసేనుడి శరీరం కనిపించింది. దాని దగ్గర సింహం అడుగుజాడలు కనిపించాయి.
వాటిని అనుసరించి వెళ్లగా చనిపోయిన సింహం కనిపించింది. అక్కడి నుంచి మరికొన్ని అడుగుజాడలు ఒక గుహ వరకు వెళ్లాయి.
శ్రీకృష్ణుడు ఒక్కడే ఆ గుహలోకి వెళ్లాడు.
అక్కడ ఒక చిన్న పిల్లవాడు శ్యమంతక మణితో ఆడుకుంటూ కనిపించాడు. పక్కనే అతని అక్క జాంబవతి కూడా ఉంది.
అంతలో జాంబవంతుడు వచ్చాడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకెళ్లడానికి వచ్చాడని భావించి అతనితో యుద్ధానికి దిగాడు.
వారిద్దరి మధ్య 21 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది.
చివరకు జాంబవంతుడికి ఒక విషయం అర్థమైంది.
తనతో ఇన్ని రోజులు పోరాడుతున్న వ్యక్తి సాధారణ మనిషి కాదని గ్రహించాడు. తాను శ్రీరాముడిగా సేవించిన భగవంతుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా వచ్చారని తెలుసుకుని నమస్కరించాడు.
తన తప్పును క్షమించమని కోరుతూ శ్యమంతక మణిని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. చూసిన క్షణమే శ్రీకృష్ణుడి రూపానికి ముగ్ధురాలైన తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకిచ్చి వివాహం చేశాడు.
శ్రీకృష్ణుడు శ్యమంతక మణితో తిరిగి ద్వారకకు వచ్చాడు.
జరిగిన నిజం తెలిసిన సత్రాజిత్తు చాలా బాధపడ్డాడు.
తాను శ్రీకృష్ణుడిపై అనవసరంగా నింద వేసినందుకు క్షమాపణ కోరాడు. తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. శ్యమంతక మణిని కూడా కృష్ణుడికే ఇవ్వాలనుకున్నాడు.
కానీ శ్రీకృష్ణుడు మణిని తీసుకోలేదు. “ఇది నీదే” అని తిరిగి సత్రాజిత్తుకే ఇచ్చేశాడు.
కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకలో లేని సమయంలో మరో సంఘటన జరిగింది.
సత్యభామ వివాహం విషయంలో అప్పటికే అసంతృప్తిగా ఉన్న కొందరి మాటలు విని శతధన్వుడు, సత్రాజిత్తును వధించి శ్యమంతక మణిని తీసుకెళ్లాడు.
తర్వాత ఆ మణిని అక్రూరుడి దగ్గర దాచాడు.
ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి, సత్యభామను ఓదార్చి, బలరాముడితో కలిసి శతధన్వుడిని వెంబడించాడు.
చివరకు శ్రీకృష్ణుడు శతధన్వుడిని పట్టుకుని వధించాడు.
కానీ ఎంత వెతికినా అతని దగ్గర శ్యమంతక మణి కనిపించలేదు.
దీంతో బలరాముడికి కూడా అనుమానం వచ్చింది. “మణి నీకే దొరికింది. నాకు చెప్పకుండా దాచావేమో” అని శ్రీకృష్ణుడిని అనుమానించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తాను ఏ తప్పూ చేయకపోయినా శ్రీకృష్ణుడిపై మళ్లీ నింద వచ్చింది. ఎందుకు ఇలా వరుసగా జరుగుతోంది? అని శ్రీకృష్ణుడు ఆలోచించాడు.
అప్పుడు నారద మహర్షి అసలు కారణాన్ని చెప్పాడు.
🌙 వినాయకుడు – చంద్రుడి కథ
వినాయకుడిని చూసి నవ్వినందుకు చంద్రుడు పార్వతీదేవి శాపానికి ఎలా గురయ్యాడో అన్న కథ అది.
భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుందో నారదుడు శ్రీకృష్ణుడికి చెప్పి, “మీరు కూడా ఆ రోజు చంద్రుడిని చూసి ఉంటారు. అందుకే మీపై వరుసగా నీలాపనిందలు వచ్చాయి” అని వివరించాడు.
అప్పుడు శ్రీకృష్ణుడికి తాను భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుడిని చూసిన విషయం గుర్తొచ్చింది. వెంటనే వినాయకుడిని ప్రార్థించాడు.
వినాయకుడు ప్రత్యక్షమై, శ్రీకృష్ణుడిపై వచ్చిన నిందలు తొలగిపోతాయని ఆశీర్వదించాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట అడిగాడు: “నాకే ఇలాంటి పరిస్థితి వస్తే, సాధారణ ప్రజలు తెలియక చంద్రుడిని చూస్తే వారి పరిస్థితి ఏమిటి?”
అప్పుడు వినాయకుడు అందరికీ ఒక వరం ఇచ్చాడు.
వినాయక చవితి రోజు తెలిసో తెలియకో చంద్రుడిని చూసినవారు, వినాయకుడిని పూజించి ఈ శ్యమంతక మణి కథను వింటే వారికి అనవసర నిందలు కలగవని వరమిచ్చాడు.
తర్వాత అక్రూరుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. శ్యమంతక మణి అతని దగ్గరే ఉందన్న నిజం అందరికీ తెలిసింది.
దాంతో శ్రీకృష్ణుడిపై వచ్చిన అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి.
శ్యమంతక మణి అక్రూరుడి దగ్గరే ఉండగా, దాని ద్వారా వచ్చిన సంపదను మంచి పనులకు ఉపయోగించాడని కథ చెబుతుంది.
🙏 చంద్రుడిని పొరపాటున చూసినప్పుడు చెప్పే శ్లోకం
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః । సుకుమారక మా రోదీః తవ హ్యేష శ్యమంతకః ॥
🙏 చివరగా ధర్మరాజుకు సూత మహర్షి ఇచ్చిన ఉపదేశం
ఇంత కథను వివరించిన తర్వాత సూత మహర్షి ధర్మరాజుతో, “నీవు కూడా భక్తితో శ్రీ వినాయక వ్రతాన్ని ఆచరించు. నీ విఘ్నాలు తొలగి, విజయం కలుగుతుంది” అని ఉపదేశించాడు.
ధర్మరాజు విధిగా వినాయకుడిని పూజించి, వ్రతాన్ని ఆచరించాడు. కాలక్రమంలో తన కష్టాలను అధిగమించి, తిరిగి రాజ్యాన్ని పొందాడు.
అలా విఘ్నాలను తొలగించి, కార్యసిద్ధిని ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం తరతరాలుగా కొనసాగుతోంది. ❤️
🙏 ఓం గం గణపతయే నమః
🙏 శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జై
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
పూర్తి నామావళి చదవండి (108)
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రతీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరాయ నమః
ఓం ప్రమథాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్క్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వస్మై నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారగురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీమేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః
ఎందుకు జరుపుకుంటాం?
పార్వతి నలుగుపిండితో బాలుడిని చేసి ప్రాణం పోసిందని, తర్వాత గజముఖంతో గణాధిపతి అయ్యాడని శివ పురాణం చెబుతుంది. భాద్రపద శుక్ల చవితి ఆయన పుట్టినరోజు.
శివ పురాణం
ఈరోజు చంద్రుడిని చూస్తే నింద వస్తుందన్న కథ శమంతకమణి కథతో ముడిపడింది — అందుకే పూజలో ఆ కథ చదివి 'నీలాపనింద' తొలగించుకుంటారు. భయానికి కాదు, కథ వినడానికి!
శమంతకోపాఖ్యానం
ఎలా జరుపుకోవాలి?
- మట్టి వినాయకుడు ఉత్తమం — పూజ అయ్యాక నీటిలో కలిసిపోతాడు, ప్రకృతికి భారం కాడు
- 21 రకాల పత్రి సమర్పణ — దొరికినన్ని చాలు, లెక్క కంటే భక్తి ముఖ్యం
- ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యం
- శమంతకమణి కథ చదవడం
- నిమజ్జనం — వచ్చినట్టే వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పే పండుగ
వినాయకుడి వాహనం ఎలుక — ఏనుగు తల ఉన్నవాడికి! సైజు కాదు, టీమ్‌వర్క్ ముఖ్యమని మొదటి లెసన్ ఆయనే ఇచ్చాడు.
చిన్న సూచనలు
- 🌺 పూజ తర్వాత — మీ ఇంటి సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఉంచే రోజుల వరకు ప్రతిరోజూ సులభంగా దీపం, ధూపం, పూలు, నైవేద్యం, హారతి చేయవచ్చు.
- ♻️ పూలు, పత్రి, గరికను ఎరువుగా మార్చగలిగితే అలా చేయండి; లేదా తడి చెత్తగా వేయండి.
- 🌊 “సహజమైనవే కదా” అని చెరువులు, కాలువలు, నదుల్లో వేయకండి. పూలు, పత్రి సహజమైనవే అయినా, పెద్ద మొత్తంలో నీటిలో పడితే అవి కుళ్లే సమయంలో నీటిలోని ప్రాణవాయువు తగ్గుతుంది. దాంతో చేపలు, ఇతర జలచరాలకు శ్వాస తీసుకోవడం కష్టమవచ్చు; నీటి నాణ్యత తగ్గుతుంది; పూలతో పాటు ఉన్న నూనె, కుంకుమ, రంగులు, ధారం వంటి పదార్థాలు జలచరాలకు మరింత హాని చేయవచ్చు.
- 🌿 ప్రకృతికి అనుకూలం అంటే “సహజమైన వస్తువును నీటిలో వేయడం” కాదు — ప్రకృతికి హాని కలగకుండా దాన్ని తిరిగి మట్టిలో కలపడం. అందుకే పూలు, పత్రి, గరికను ఎరువుగా మార్చడం ఉత్తమం.
- 🍌 పండ్లు, కొబ్బరికాయ, నైవేద్యం ప్రసాదంగా తీసుకోండి, పంచుకోండి. అలంకరణలను తర్వాతి పూజలకు మళ్లీ ఉపయోగించండి.
- 🌊 నిమజ్జనం — సహజ మట్టి వినాయకుడైతే, వీలైతే ఇంట్లోనే పెద్ద పాత్రలో నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం తర్వాత ఆ నీటిని మొక్కలకు పోయవచ్చు. బయట నిమజ్జనం చేస్తే, నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన కొలనులనే ఉపయోగించండి. పూలు, ప్లాస్టిక్ కవర్లు, థర్మాకోల్, వస్త్ర అలంకరణలను నీటిలో వేయకండి.
- ❤️ వినాయకుడిని ప్రేమగా ఇంటికి ఆహ్వానించాం. పూలతో పూజించాం. నైవేద్యం పెట్టాం. హారతి ఇచ్చాం. ఆయనకు వీడ్కోలు చెప్పేటప్పుడు కూడా… ఆయన సృష్టికి హాని కలగకుండా చూసుకుంటే, అది మన పూజకు మరింత అందమైన ముగింపు. 🌿 వినాయకుడిని పూజిద్దాం. వినాయకుడి సృష్టినీ గౌరవిద్దాం. 🙏 గణపతి బప్పా మోరియా!
తరచూ అడిగే ప్రశ్నలు
వినాయక చవితి ఎప్పుడు?
2026 సెప్టెంబర్ 14, సోమవారం.
వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు?
పార్వతి నలుగుపిండితో బాలుడిని చేసి ప్రాణం పోసిందని, తర్వాత గజముఖంతో గణాధిపతి అయ్యాడని శివ పురాణం చెబుతుంది. భాద్రపద శుక్ల చవితి ఆయన పుట్టినరోజు. (శివ పురాణం)
వినాయక చవితి ఎలా చేయాలి?
• మట్టి వినాయకుడు ఉత్తమం — పూజ అయ్యాక నీటిలో కలిసిపోతాడు, ప్రకృతికి భారం కాడు • 21 రకాల పత్రి సమర్పణ — దొరికినన్ని చాలు, లెక్క కంటే భక్తి ముఖ్యం • ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యం • శమంతకమణి కథ చదవడం • నిమజ్జనం — వచ్చినట్టే వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పే పండుగ
వినాయక చవితి — ఏమేమి కావాలి?
సామగ్రి లిస్ట్‌లో మొత్తం 61 వస్తువులు, నిత్య పూజా సామగ్రి · వినాయకుడు & పూజా పీట · పూలు • పత్రి • పండ్లు & తాంబూలం · నైవేద్యానికి · ఏకవింశతి పత్రి అనే విభాగాలుగా.
వినాయక చవితి — పూజ ఎంత సేపు పడుతుంది?
దాదాపు 60 నిమిషాలు — 17 దశలు.