శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణ పరమాత్మ · దాదాపు 35 నిమిషాలు · 19 దశలు
ఎప్పుడు?
- మన యాప్ తేదీ
- టీటీడీ పంచాంగం
ఈ సంవత్సరం నిశీథ కాల పూజా ముహూర్తం: సెప్టెంబర్ 4 రాత్రి 11:57 PM నుంచి సెప్టెంబర్ 5 అర్ధరాత్రి 12:43 AM వరకు
పూర్తి సమయ వివరాలు
శ్రీకృష్ణుడు అష్టమి తిథిలో, అర్ధరాత్రి సమయంలో అవతరించినందున, అర్ధరాత్రి నిశీథ కాలంలో కృష్ణ జన్మాష్టమి పూజను చేయవచ్చు. అర్ధరాత్రి జన్మకాలంలో పూజ చేసి, శ్రీకృష్ణ జన్మోత్సవం జరుపుకోవడం విశేషంగా భావిస్తారు. అర్ధరాత్రి పూజ చేయడం వీలుకాకపోతే, మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం అనుకూలమైన సమయంలో భక్తితో పూజ చేసుకోవచ్చు. సమయం కంటే భక్తి, భావం ముఖ్యం. బాలకృష్ణుడి ఆగమనాన్ని ప్రేమగా ఆహ్వానిస్తూ, మీకు వీలైన సమయంలో భక్తితో పూజ చేసుకోండి. 🦚🙏 🦚 పూజా పీట ఎప్పుడు తీయాలి? పూజ పూర్తయ్యాక పూజా పీటను ఆ రాత్రికి అలాగే ఉంచండి. మరుసటి రోజు (సెప్టెంబర్ 5) ఉదయం బాలకృష్ణుడికి దీపం వెలిగించి, నమస్కరించి, నైవేద్యం సమర్పించిన తర్వాత పూజా పీటను సర్దుకోవచ్చు. ఉపవాసం పాటించినవారు పారణ చేసిన తర్వాత పూజా పీటను సర్దుకోవచ్చు. పారణ సమయం: సెప్టెంబర్ 5, ఉదయం 6:01 తర్వాత 🙏 ఓం శ్రీ కృష్ణాయ నమః
విధానం — ఒక చూపులో
తేదీలు మన సొంత పంచాంగ ఇంజిన్ లెక్క — టీటీడీ శ్రీవారి క్యాలెండర్‌తో నిమిషం తేడా లేకుండా సరిపోతుంది. ఈ విధానాన్ని మా గురువుగారు పరిశీలించారు.
శ్రీకృష్ణుడు అష్టమి తిథిలో, అర్ధరాత్రి సమయంలో అవతరించినందున, అర్ధరాత్రి నిశీథ కాలంలో కృష్ణ జన్మాష్టమి పూజను చేయవచ్చు. అర్ధరాత్రి జన్మకాలంలో పూజ చేసి, శ్రీకృష్ణ జన్మోత్సవం జరుపుకోవడం విశేషంగా భావిస్తారు. అర్ధరాత్రి పూజ చేయడం వీలుకాకపోతే, మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం అనుకూలమైన సమయంలో భక్తితో పూజ చేసుకోవచ్చు. సమయం కంటే భక్తి, భావం ముఖ్యం. బాలకృష్ణుడి ఆగమనాన్ని ప్రేమగా ఆహ్వానిస్తూ, మీకు వీలైన సమయంలో భక్తితో పూజ చేసుకోండి. 🦚🙏
🌙 ఈ సంవత్సరం నిశీథ కాల పూజా ముహూర్తం: సెప్టెంబర్ 4 రాత్రి 11:57 PM నుంచి సెప్టెంబర్ 5 అర్ధరాత్రి 12:43 AM వరకు
పూర్తి విధానం
పూజకు సిద్ధం అవ్వండి
- స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి, చిన్న పీటపై వస్త్రం పరచండి.
- శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంచండి. బాలకృష్ణుడి విగ్రహం ఉంటే చిన్న ఊయలలో కూడా ఉంచవచ్చు.
సామాన్లు ఒకసారి చూసుకోండి
- పూజలోకి వెళ్ళే ముందు నిత్య పూజ సామాన్లు మరియు చెక్‌లిస్ట్‌లో ఇచ్చినవి అన్నీ లేదా వీలైనవి ఉన్నాయా ఒకసారి చూసుకోండి.
- మీరు ఒకసారి చూసుకుంటాను అంటే కింద ఉన్న చెక్‌లిస్ట్ బటన్ నొక్కండి; అవసరం లేదు అనుకుంటే ముందుకి వెళ్దాం.
దీపం వెలిగించండి
- పూజా స్థలంలో దీపం వెలిగించండి.
శ్లోకంశుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః । శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే ॥
ఆచమనం
- కొద్దిగా నీటిని చేతిలో తీసుకుని ఆచమనం చేయండి.
- గురువుగారు మూడు నామాలు చెబుతారు — ఒక్కో నామానికీ ఒక్కసారి నీళ్ళు తీసుకోండి.
సంకల్పం
- చేతిలో కొద్దిగా అక్షతలు, నీరు తీసుకుని మనసులో ఇలా అనుకోండి:
- “ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం భక్తితో ఈ పూజ చేస్తున్నాను.”
- అక్షతలను పూజా పళ్లెంలో వదలండి.
గణపతి ప్రార్థన
- ముందుగా గణపతిని స్మరించండి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ పూర్తవ్వాలని ప్రార్థించండి.
- కొద్దిగా అక్షతలు లేదా పువ్వు సమర్పించండి. కొద్దిగా బెల్లం లేదా పండును నైవేద్యంగా సమర్పించండి.
శ్లోకంశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ । నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
శ్రీకృష్ణుడిని ఆహ్వానించండి
- కృష్ణుడి ముందు పువ్వు పట్టుకుని:
- “శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో ఆవాహన చేస్తున్నాను.”
- అని చెప్పి పువ్వు సమర్పించండి.
శ్లోకంఓం శ్రీ కృష్ణాయ నమః
బాలకృష్ణుడికి అభిషేకం
- చిన్న లోహ విగ్రహం ఉంటే మాత్రమే చేయండి.
- నీరు, పాలు లేదా పంచామృతంతో సున్నితంగా అభిషేకం చేయవచ్చు.
- తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, మృదువైన వస్త్రంతో తుడవండి.
- ఫోటో లేదా అభిషేకానికి అనుకూలం కాని విగ్రహానికి ఈ అడుగును వదిలేయండి.
శ్లోకంఓం నమో భగవతే వాసుదేవాయ
వస్త్రం — అలంకారం
- బాలకృష్ణుడికి చిన్న వస్త్రం ఉంటే ధరింపజేయండి. లేకపోయినా పర్లేదు.
- చందనం, కుంకుమను సున్నితంగా సమర్పించండి.
- తులసి, పూలతో అలంకరించండి.
శ్లోకంఓం శ్రీ కృష్ణాయ నమః — గంధం సమర్పయామి ఓం శ్రీ కృష్ణాయ నమః — పుష్పాణి సమర్పయామి
తులసి సమర్పణ
- కృష్ణ పూజలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది.
- ఒక్కో తులసి దళం సమర్పిస్తూ జపించండి.
- తులసి లభించకపోతే భక్తితో పూలు సమర్పించవచ్చు.
శ్లోకంఓం నమో భగవతే వాసుదేవాయ తులసీ దళం సమర్పయామి
శ్రీకృష్ణ అష్టోత్తరం
- శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదవండి లేదా వినండి.
- ప్రతి నామానికి పువ్వు, తులసి లేదా అక్షతలు సమర్పించవచ్చు.
భగవద్గీత / కృష్ణ నామస్మరణ
- కనీసం ఒక గీతా శ్లోకం చదవండి. లేదా వినండి.
శ్లోకంపత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి । తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ॥
ధూపం — దీపం
- ధూపం చూపిస్తూ, తర్వాత దీపం చూపిస్తూ సమర్పించండి.
శ్లోకంఓం శ్రీ కృష్ణాయ నమః — ధూపం ఆఘ్రాపయామి ఓం శ్రీ కృష్ణాయ నమః — దీపం దర్శయామి
నైవేద్యం
- కృష్ణుడికి మీ ఇంటి సంప్రదాయం ప్రకారం నైవేద్యం సమర్పించండి.
- తులసి దళం నైవేద్యంపై ఉంచితే మంచిది.
- కొద్దిగా నీరు కూడా సమర్పించండి.
శ్లోకంఓం శ్రీ కృష్ణాయ నమః — నైవేద్యం సమర్పయామి
కృష్ణ జన్మకథ
- శ్రీకృష్ణుడి జన్మకథను చదవండి లేదా వినండి:
- మథురలో దేవకీ–వసుదేవుల వివాహం ఘనంగా జరిగింది. దేవకీ అన్న అయిన కంసుడు, తన చెల్లిని ఎంతో ప్రేమగా పంపించడానికి స్వయంగా రథం నడిపించాడు.
అర్ధరాత్రి జన్మోత్సవం
- మీ కుటుంబ సంప్రదాయంలో అర్ధరాత్రి కృష్ణ జన్మోత్సవం చేస్తే:
- గంట మోగించండి. “జై శ్రీకృష్ణ”, “గోవిందా” అని నామస్మరణ చేయండి.
- బాలకృష్ణుడిని ఊయలలో ఉంచి సున్నితంగా ఊపండి.
హారతి
- కర్పూర హారతి లేదా దీప హారతి ఇవ్వండి.
- కింది శ్లోకం చెప్పి నమస్కరించండి.
శ్లోకంకృష్ణం వందే జగద్గురుమ్ ఓం శ్రీ కృష్ణాయ నమః । నీరాజనం సమర్పయామి ॥
ప్రార్థన
- చివరగా చేతులు జోడించి:
- “కృష్ణా… మా ఇంట్లో ప్రేమ, ధర్మం, ఆరోగ్యం, ఆనందం నిలిచేలా అనుగ్రహించు. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించు.”
ప్రసాదం
- కొద్దిసేపటి తర్వాత నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులతో పంచుకోండి.
- మీ ఇంటి సంప్రదాయం ప్రకారం కొన్ని అడుగులు మారవచ్చు. పూజలో సామగ్రి కంటే భక్తి, భావమే ముఖ్యమైనవి. మీ కుటుంబంలో పాటించే ప్రత్యేక ఆచారం ఉంటే దానికే ప్రాధాన్యం ఇవ్వండి.
సామగ్రి లిస్ట్
🪔 నిత్య పూజా సామగ్రి
- పసుపు
- కుంకుమ
- గంధం
- అక్షతలు
- కర్పూరం
- అగరబత్తులు · ధూపం
- వత్తులు
- నూనె · నెయ్యి
- దీపం కుందులు
- అగ్గిపెట్టె
- గంట
- హారతి పళ్లెం
- పూజా నీటి పాత్ర
- చిన్న గిన్నెలు · చెంచా
- పంచపాత్ర · ఉద్ధరిణి
- పూజా పళ్లెం
- నైవేద్యం గిన్నెలు
🛕 పూజా పీట
- పూజా పీట
- పీటపై వస్త్రం
🌸 పూలు · పండ్లు · పత్రాలు
- పూలు
- పూలమాల
- తులసి దళాలు
- అరటిపండ్లు
- ఇతర పండ్లు
- కొబ్బరికాయ
🦚 కృష్ణాష్టమికి ప్రత్యేకం
- శ్రీకృష్ణుడి విగ్రహం / ఫోటో
🍚 నైవేద్యం — వీలైనవి చాలు
- వెన్న
- పటికబెల్లం
- అటుకులు, బెల్లం
- పాలు
- పెరుగు
- పంచామృతం
- పాయసం / పరమాన్నం
- లడ్డూ
- చక్కెర పొంగలి
- మీ ఇంటి సంప్రదాయం ప్రకారం ఇతర నైవేద్యాలు
🥛 అభిషేకానికి
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనె
- చక్కెర
- శుద్ధజలం
- అభిషేక పాత్ర
✨ అలంకరణ
- చిన్న కృష్ణుడి పాదాల ముగ్గుపిండి
- ఇంటి అలంకరణ సామగ్రి
- బాలకృష్ణుడి చిన్న వస్త్రం
- చిన్న ఊయల
- నెమలి ఈక
ప్రసాదం
వెన్న
వెన్నలో కొద్దిగా పటికబెల్లం కలిపి
పటికబెల్లం
కృష్ణుడికి ఇష్టమైనది
అటుకులు, బెల్లం
కుచేలుడి కథను గుర్తు చేసేది
పాలు
పెరుగు
పంచామృతం
పాయసం / పరమాన్నం
లడ్డూ
చక్కెర పొంగలి
మీ ఇంటి సంప్రదాయం ప్రకారం తయారుచేసే ఇతర నైవేద్యాలు
📖 కృష్ణ జన్మకథ
మథురలో దేవకీ–వసుదేవుల వివాహం ఘనంగా జరిగింది. దేవకీ అన్న అయిన కంసుడు, తన చెల్లిని ఎంతో ప్రేమగా పంపించడానికి స్వయంగా రథం నడిపించాడు.
కానీ ఆ ప్రయాణం మధ్యలో ఒక ఆకాశవాణి వినిపించింది— “దేవకీకి పుట్టే ఎనిమిదవ సంతానం నీ మరణానికి కారణమవుతుంది.”
అంతే… చెల్లిపై ఉన్న ప్రేమను భయం కమ్మేసింది. దేవకీని అక్కడికక్కడే చంపాలని కంసుడు ప్రయత్నించాడు.
వసుదేవుడు అతన్ని ఆపి— “దేవకీకి పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను” అని మాటిచ్చాడు. అయినా కంసుడు దేవకీ–వసుదేవులను కారాగారంలో బంధించాడు.
కాలం గడిచింది. దేవకీకి పుట్టిన పిల్లలను కంసుడు ఒక్కొక్కరిని హతమార్చాడు. ఒక తల్లి తన బిడ్డలను కోల్పోతూ… ఒక తండ్రి ఏమీ చేయలేక చూస్తూ… ఆ కారాగారంలోనే సంవత్సరాలు గడిచిపోయాయి.
చివరికి… ఎనిమిదవ సంతానం జన్మించే సమయం వచ్చింది. అష్టమి తిథి. అర్ధరాత్రి సమయం.
బయట అంతా చీకటి… కానీ ఆ కారాగారం మాత్రం దివ్య కాంతితో నిండిపోయింది. దేవకీకి శ్రీమహావిష్ణువు స్వయంగా — శ్రీకృష్ణుడిగా అవతరించాడు.
అది సాధారణ శిశువు జననం కాదు. అధర్మం మధ్యలో ధర్మం పుట్టిన క్షణం. చీకటి మధ్యలో వెలుగు వచ్చిన క్షణం.
కృష్ణుడు పుట్టిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. కారాగార ద్వారాలు వాటి అంతట అవే తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢనిద్రలోకి వెళ్లిపోయారు. వసుదేవుడి సంకెళ్లు సడలిపోయాయి.
వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని… ఆ రాత్రే మథుర నుంచి గోకులానికి బయలుదేరాడు. బయట భారీ వర్షం. యమునా నది ఉప్పొంగుతోంది.
తలపై తన చిన్నారి… ముందు ఉప్పొంగుతున్న యమున… అయినా వసుదేవుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.
ఆదిశేషుడు తన పడగలను విప్పి, బాలకృష్ణుడిని వర్షం నుంచి కాపాడుతూ వెంబడించాడు. యమునమ్మ కూడా చిన్న కృష్ణుడి పాదస్పర్శ కోసం ఉప్పొంగి… ఆ చిన్న పాదాలను తాకాలని తపిస్తూ, వసుదేవుడి ప్రయాణానికి దారి ఇచ్చింది.
చివరికి వసుదేవుడు గోకులంలోని నందుడు–యశోదమ్మ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ యశోదమ్మకు అప్పుడే ఒక ఆడశిశువు జన్మించింది. వసుదేవుడు బాలకృష్ణుడిని అక్కడ ఉంచి… ఆ ఆడశిశువును తీసుకుని తిరిగి మథుర కారాగారానికి చేరుకున్నాడు.
ఉదయం కంసుడికి శిశువు పుట్టిందని తెలిసింది. అతడు ఆ బిడ్డను హతమార్చడానికి ప్రయత్నించగా… ఆమె అతని చేతుల నుంచి తప్పించుకుని దివ్యరూపం ధరించి— “నిన్ను సంహరించేవాడు ఇప్పటికే మరొకచోట జన్మించాడు” అని హెచ్చరించింది.
ఇక గోకులంలో… యశోదమ్మకు మాత్రం తన ఒడిలో ఉన్నది ఎవరో తెలియదు. లోకాలను కాపాడేవాడని తెలియదు. అధర్మాన్ని అంతం చేయడానికి వచ్చినవాడని తెలియదు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువని తెలియదు.
ఆమెకు ఆయన దేవుడు కాదు… ఆమె చిన్ని కన్నయ్య.
ఆమె చేతిలో వెన్న తిన్నాడు. ఆమె ఒడిలో నిద్రపోయాడు. గోపికల ఇళ్లలో వెన్న దొంగిలించాడు. నందుడి ఇంట్లో తన నవ్వులతో, అల్లరితో ఆనందం నింపాడు.
ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చిన పరమాత్మ… ఒక అమ్మ ఒడిలో చిన్న బాలుడిగా పెరిగాడు.
మథురలో దేవుడిగా అవతరించిన కృష్ణుడు… గోకులంలో ప్రేమతో “మన కన్నయ్య” అయ్యాడు.
జై శ్రీకృష్ణ గోవిందా… గోపాలా…
శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి
పూర్తి నామావళి చదవండి (108)
ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః (10)
ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః (20)
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారిణే నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః (30)
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమలార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలతాలభేత్రే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః (40)
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసినే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః (50)
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః (60)
ఓం స్యమంతకమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః (70)
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః
ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః (80)
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురువే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకాయ నమః
ఓం యుధిష్టిరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హావతంసకాయ నమః (90)
ఓం పార్థసారథయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృతమహోదధ్యే నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశనవాహనాయ నమః (100)
ఓం జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్థాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః (108)
ఎందుకు జరుపుకుంటాం?
శ్రావణ కృష్ణ అష్టమి అర్ధరాత్రి, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు మధురలో జన్మించాడని భాగవతం చెబుతుంది. చెరసాలలో పుట్టి లోకానికి స్వేచ్ఛ చూపిన దేవుడు.
భాగవత పురాణం
కృష్ణుడు అంటే కేవలం వెన్న దొంగ కాదు — భగవద్గీత చెప్పిన గురువు. ఆయన పుట్టినరోజు అంటే ఆ జ్ఞానం పుట్టిన రోజు కూడా.
గీతా దృష్టి
ఎలా జరుపుకోవాలి?
- అర్ధరాత్రి వరకూ జాగరణ — పుట్టింది అర్ధరాత్రే కదా!
- ఉయ్యాలలో చిన్ని కృష్ణుడి విగ్రహం పెట్టి ఊపడం
- వెన్న, అటుకులు, పాలు నైవేద్యం — ఆయనకి ఇష్టమైన మెనూ
- ఇంటి ముందు చిన్న పాదాల ముగ్గులు — కృష్ణుడు ఇంట్లోకి వచ్చినట్టు
- భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం చదవడం
ప్రపంచంలో పుట్టినరోజుకి 'వెన్న దొంగతనం' సెలబ్రేట్ చేసే ఏకైక దేవుడు కృష్ణుడే. అల్లరికి కూడా ఆరాధన దక్కుతుందని ప్రూఫ్!
చిన్న సూచనలు
- వీటిలో మీకు వీలైనవి నైవేద్యంగా సమర్పించవచ్చు. అన్నీ అవసరం లేదు.
- మీ ఇంటి సంప్రదాయం ప్రకారం కొన్ని అడుగులు మారవచ్చు. పూజలో సామగ్రి కంటే భక్తి, భావమే ముఖ్యమైనవి.
- సమయం కంటే భక్తి, భావం ముఖ్యం.
తరచూ అడిగే ప్రశ్నలు
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?
2026 సెప్టెంబర్ 4, శుక్రవారం.
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారు?
శ్రావణ కృష్ణ అష్టమి అర్ధరాత్రి, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు మధురలో జన్మించాడని భాగవతం చెబుతుంది. చెరసాలలో పుట్టి లోకానికి స్వేచ్ఛ చూపిన దేవుడు. (భాగవత పురాణం)
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా చేయాలి?
• అర్ధరాత్రి వరకూ జాగరణ — పుట్టింది అర్ధరాత్రే కదా! • ఉయ్యాలలో చిన్ని కృష్ణుడి విగ్రహం పెట్టి ఊపడం • వెన్న, అటుకులు, పాలు నైవేద్యం — ఆయనకి ఇష్టమైన మెనూ • ఇంటి ముందు చిన్న పాదాల ముగ్గులు — కృష్ణుడు ఇంట్లోకి వచ్చినట్టు • భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం చదవడం
శ్రీకృష్ణ జన్మాష్టమి — ఏమేమి కావాలి?
సామగ్రి లిస్ట్‌లో మొత్తం 48 వస్తువులు, నిత్య పూజా సామగ్రి · పూజా పీట · పూలు · పండ్లు · పత్రాలు · కృష్ణాష్టమికి ప్రత్యేకం · నైవేద్యం — వీలైనవి చాలు · అభిషేకానికి · అలంకరణ అనే విభాగాలుగా.
శ్రీకృష్ణ జన్మాష్టమి — పూజ ఎంత సేపు పడుతుంది?
దాదాపు 35 నిమిషాలు — 19 దశలు.